రైతుల ఫోన్లు టింగ్.. టింగ్మంటూ మోగాయి. రెండోరోజు రెండెకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమైంది. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 3,80,457 మంది రైతులకు రూ.153.41 కోట్ల పెట్టుబడి సాయం అందింది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల నుంచి రైతులు డబ్బులు డ్రా చేసుకొని మురిసిపోతున్నారు. రెండ్రోజులు కలిపి 5,16,922 మంది రైతులకు గానూ రూ.202.31 కోట్లు అందజేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు కర్షకులు క్షీరాభిషేకం చేస్తున్నారు.
మహబూబ్నగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ రైతుబంధు సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. మంగళవారం ఒక్కరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.153.41కోట్ల పెట్టుబడి సాయం అందించారు. 3,80,457 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రైతుబంధు పడిన కర్షకులు బ్యాంకుల్లో, ఏటీఎం కేంద్రాలల్లో డ్రా చేసుకోవడం కనిపించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో బ్యాంకులు కళకళలాడాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమయానికి రైతుబంధు అందించిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 5,16,922మంది రైతులకు రూ.202.31 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో రూ. 202.31కోట్ల జమ..
ప్రభుత్వం అనుకున్నట్లుగానే రైతుబంధు కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయానికి ఊతమిస్తున్నది. వారం రోజుల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు సాయం అందిస్తామని ప్రకటించారు. అనుకున్నట్లుగానే సోమ, మంగళవారాల్లో ఉమ్మడి జిల్లాలో రైతుల ఖాతాల్లోకి రూ. 202.31కోట్లు జమ చేశారు. దశలవారీగా రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. గద్వాల జిల్లాలో 36,157మంది రైతులకు రూ.11.81 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 80, 549 మందికి రూ.24.28కోట్లు, వనపర్తి జిల్లాలో 60,376 మందికి రూ.16.26కోట్లు, నారాయణపేట జిల్లాలో 75,242 మందికి రూ.63.89 కోట్లు, మహబూబ్నగర్ జిల్లాలో 1,28,133 మంది రైతులకు 37.17 కోట్లు ట్రెజరీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. సోమవారం 1,36,465 మంది రైతులకు 48.90కోట్లు జమ కాగా, మంగళవారం ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
ఎక్కడ చూసినా రైతుబంధు చర్చే..
రైతుబంధు డబ్బులు ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాలకు జమవుతూ సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో రైతులు సంబురపడిపోతున్నారు. పెట్టుబడి సాయాన్ని బ్యాంకులో తీసుకొని వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.