గండీడ్ : ఆయిల్ ఫామ్ తోటలు ( Oil farm plantations ) పెంచి అధిక ఆదాయం ( Income ) పొందాలని ఉద్యాన , పట్టు పరిశ్రమ శాఖ అధికారి స్వప్న రైతులకు సూచించారు. గండీడ్ ( Gandeed ) మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు , శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు.
చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఎస్సీ ,ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీతో ఆయిల్ ఫామ్ మొక్కలను ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా అందిస్తుందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు వందశాతం సబ్సిడీ ద్వారా మొక్కలు అందజేస్తున్నామన్నారు.
ఆసక్తిగల రైతులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గండీడ్ మండల పరిధిలో అధిక సంఖ్యలో రైతులు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ తోటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీ నారాయణ , ఆయిల్ ఫామ్ క్లస్టర్ ఆఫీసర్ శేఖర్, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.