హన్వాడ : వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ( Flood effect Areas ) అధికారులు పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. హన్వాడ ( Hanwada ) మండలం ఇబ్రహీంబాద్ శివారులోని హేమసముద్రం చెరువుకు పడ్డ బుంగను మాజీ మంత్రి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడం తో 1.5 కి. మీ ట్రాక్టర్ పై ప్రయాణించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.
గండి పడిన విధానాన్ని , నీళ్లు కిందికి వెళ్లకుండా తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీళ్లు కిందకు వెళ్లకుండా రైతులకు ఎక్కువ నష్టం జరుగకుండా వేగంగా గండి పూడ్చాలని అధికారులకు సూచించారు. హేమాసముద్రం చెరువు ఉమ్మడి జిల్లాలోనే పెద్ద చెరువని పేర్కొన్నారు. గతంలో చెరువును రిజర్వాయర్ చేద్దామని అనుకుని , ఒక గ్రామం.. రెండు తండాలు మునుగుతాయని అధికారుల సూచనలతో ఉదండాపూర్ నుంచి ఇక్కడికి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు కు బుంగ పడితే పూడ్చేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇంజినీర్లకు అవసరమున్న సదుపాయాలు కల్పించి కొత్త టెక్నాలజీ ప్రకారం చెరువు బుంగ పూడ్చాలని డిమాండ్ చేశారు. చెరువు బుంగ పూడ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని కోరారు. గతంలో వర్షాలు పడి చెరువులు, ప్రాజెక్ట్‌లోకి నీరు వస్తే అధికారులను అప్రమత్తం చేసి నష్టం కలుగకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు.
అవకాశం ఉన్న చోట చిన్న చెరువులను కూడా నింపుకున్న పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పుడు అలాంటి సన్నద్ధత కనిపించడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ హన్వాడ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు కొండా లక్ష్మయ్య, జంబులయ్య, నెత్తికొప్పుల శ్రీనివాసులు, చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.