శ్రీశైలం, ఆగస్టు 16 : శ్రీశైలం జలాశయం 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. శనివారం జూరాల డ్యాం నుంచి 41,112 క్యూసెక్కు లు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 30,653 క్యూసెక్కులు విడుదలవగా.. సాయంత్రానికి 1,89,169 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరాయి. డ్యాం కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాలకు 65,824 క్యూసెక్కులు వదులుతుండగా.. 1,99,544 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులు ఉండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 215.8070 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 199.73 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
దేవరకద్ర, ఆగస్టు 16 : పాలమూరు జిల్లాలో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌కు వరద కొనసాగుతున్నది. శనివారం ప్రాజెక్టు 2 షెట్టర్లను తెరిచి దిగువకు 1,500 క్యూసెక్కులను అధికారులు వదిలారు. దీంతో ఊక చెట్టు వాగు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 32.5 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం ఫుల్ లెవల్లో ఉంటూ నిండుకుండను తలపిస్తున్నది. ప్రాజెక్టు వద్దకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉల్లాసంగా గడుపుతూ సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.
మక్తల్, ఆగస్టు 16 : భీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతున్నది. దీంతో శనివారం ఐదు గేట్లను తెరిచి దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. రిజర్వాయర్‌లోకి 2,500 క్యూసెకులు వచ్చి చేరుతుండగా.. దిగువకు అంతే మొ త్తం లో నీటిని వదిలినట్లు డీఈఈ సురేశ్, ఏఈ రాహుల్ తెలిపారు. పూర్తిస్థాయి సామర్థ్యం 3.317 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.67 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు చెప్పారు.