గద్వాల, ఆగస్టు 3 : నడిగడ్డ తలాపున కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా వానకాలంలో జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుతో పాటు ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి, జములమ్మ రిజర్వాయర్లు నిండుగా ఉన్నా వరి సాగుపై పాలకులు, అధికారులు స్పష్టత నివ్వక పోవడంతో రైతులు చాలా మంది, నీరు పంట చివరి వరకు పారుతాయో లేదో అనే అనుమానంతో తమ భూములను చాలా వరకు పడావు పెట్టుకుంటున్నారు.
ప్రాజెక్టుల నిండా నీళ్లున్నా ఆయక ట్టు పొలాలు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వానకాలం మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇంకా సాగు పనులే మొదలు కాలేదు. ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడ్ ఎత్తిపోతలకు నీరు ఎత్తి పోస్తున్న ఎల్నినో కారణంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యం లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాధారణం కంటే తక్కు వ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు వరి సాగుపై సందిగ్ధంలో ఉన్నారు. వర్షాలు కు రువక పోతే ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటికి మాత్ర మే విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు వరి వేయాలావద్దా అనే ఆలోచనలో పడ్డారు.
రైతులు ప్రాజెక్టులకు నీరు రాక పోదా అనే ఆలోచనతో ముందుగానే నారుమడులు పోసుకున్నారు. ప్రస్తుతం నారు మడులు చేతికి వచ్చాయి. కానీ రైతులు నాట్లు వేయడానికి జంకుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులు నిండుగా ఉండడంతో అక్కడక్కడ రైతులు తమ పొలాలను నాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ద్వారా కాల్వలకు వదులు తున్న నీరు పంట చేతికి వచ్చే వరకు అధికారులు విడుదల చేస్తారా లేదా ఆనే అనుమానంతో రైతులు నారు మడులు చేతికి వచ్చినా నాట్లు వేయడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది.
గత ఏడాది జిల్లాలో వానకాలం వరి సాగు 1,16,532 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా 1,14,405 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో బోరు బావుల కింద 26,490 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేసినట్లు అంచనా వేశారు. మిగతా రైతులు నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేసి ఉంచినప్పటికీ నాట్లు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
ఎగువన వర్షాలు కురిసి జూరాల ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో గత మూడు రోజుల కిందట అధికారులు లిఫ్ట్లు, రిజర్వాయర్లు, కాల్వలకు నీటిని విడుదల చేశారు. అయితే కాల్వలు నిండుగా పారుతుండడంతో రైతులు వరి సాగు చేయడానికి పను లు మొదలు పెట్టారు.
అయితే అధికారులు మాత్రం ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురువడం వల్ల వరదలు వస్తున్నాయని ఆ తర్వాత వరదలు వచ్చే అవకాశం లేదని చెప్పడం తో పాటు ఎల్నినో ప్రభావం కారణంగా ఈ వానకాలంలో తాగునీటికి తప్పా సాగునీటికి నీరు విడుదల చేయడం కష్టమని చెబుతూనే, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తుండడంతో రైతులకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. తమ పొలాల పక్కన నీరు పారుతుంటే వరి పంట సాగు చేయవద్దని అధికారులు చెబుతుండడంతో రైతులకు ఎమి చేయాలో దిక్కు తోచడం లేదు. ఇప్పటికైనా అధికారు లు జూరాల ప్రాజెక్టు కింద వరి సాగుకు నీటిని విడుదల చేస్తారో లేదా చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.