కొల్లాపూర్ రూరల్, మార్చి 23 : మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు స్థానిక సర్పంచుల ప్రమేయం లేకుండాలనే ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ కిట్టు వంటి ప్రభుత్వ పథకాలను ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పంపిణీ చేయడం ఏమిటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ప్రొ టోకాల్ పాటించని అధికారుల తీరును నిరిసిస్తూ సోమవారం కొల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్కు చెందిన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సింగోటం గ్రామ సర్పంచ్ యాదన్నగౌడ్, మొలచింతలపల్లి సర్పంచ్ మేకల వరలక్ష్మి, ఎల్లూరు సర్పంచ్ శశికళ మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలుగా మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు గ్రామాలలో ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ గల్లీ నాయకులచేత, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులచేత పంపిణీ చేయిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గ్రామ సర్పంచులను అవమానిస్తూ భారత రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించడమేనా ప్రజాపాలన అంటే ప్రశ్నించారు.
అధికారులైన తమ తీరును మార్చుకొని ప్రొటోకాల్ పాటించేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాచినేనిపల్లి సర్పంచ్ చంద్రయ్య, రామాపురం ఉప సర్పంచ్ పరశురాముడు, సింగో టం ఉప సర్పంచ్ సాయికృష్ణగౌడ్, మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ వెంకటరమణమ్మ, 7వ వార్డు కౌన్సిలర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అద్యక్షుడు సాంబశివుడు, మండల నాయకులు సురేందర్ రావు, బండల వెంకటస్వామి, కాటం జంబులయ్య, రామాపురం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.