వనపర్తి టౌన్, ఆగస్టు 18 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మోటర్లను నడపకుండా పాలమూరును పడావు పెట్టిన ఘనుడు సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ఎన్నో ఆశలు కల్పించి వంచించిందని కాంగ్రెస్ కుట్రలను ఛేదించేందుకే బీఆర్ఎస్ కదిలిందని మాజీ మంత్రి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మంగళవారం కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ కదన రంగం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఆడ బిడ్డలకు ఆర్థిక భరోసా, ఆత్మగౌరవాన్ని నింపింది కేసీఆర్ ప్రభుత్వమని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆపే కు ట్ర చేస్తే అంతు తేలుస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉప్పెనలా తరలివచ్చిన మ హిళలను ఆయన అభినందించారు. వర్షాకాలంలో పశ్చిమ కనుమలు మహారాష్ట్రలో కురిసిన వర్షాలు, కర్ణాటకలో ఉన్న నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులు నిం డి జూరాలకు నీరు వస్తే కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని అందించి ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఇవ్వాల్సిన సోయి మంత్రులకు, జిల్లా మంత్రులకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి మోటర్లను ఆన్ చేసి 200 రోజులు నడిస్తే మన భూములు సస్యశ్యామలమయ్యేవని ఆయన గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్పితే ప్రజల ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి మోటర్లను నడపకుండా పడావు పెట్టింది కాంగ్రెస్ నేతలు కాదా, ప్రజలు మూల్యం చెల్లించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఆంధ్రా నీళ్ల దోపిడీ చూసేందుకు పోతిరెడ్డిపాడు పర్యటనకు వెళితే ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారని, పోతిరెడ్డిపాడు ద్వారా 15గేట్లు తెరిచి వారంలో 5 టీఎంసీలు జల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే అమలు చేయకపోతే అడుగడుగున పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని , కాంగ్రెస్ వైఫల్యాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. తెలంగాణ ఉద్య మం నడిపామని, ప్రతిపక్షంలో ఉన్నామని ప్రజాస్వామ్యంలో పోరాటాలు ఎలా చేయాలో తమకు కొత్తే మి కాదని అన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజల నీటి ప్రయోజనాలు, రైతా ంగ ప్రయోజనాలను కాపాడాల్సిన కాంగ్రెస్ పాలకులు, సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా అధికారి అయిన ఆదిత్యదాస్ను దగ్గర పెట్టుకొని తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు. తట్టెడు మట్టి పనికైనా ఇంటి వాడు ఉండాలనే సోయి ఈ ప్రభుత్వం మరిచి ఆంధ్రా అధికారులను నియమించుకుంటే తెలంగాణకు నీటి ప్రయోజనాలు ఎలా దక్కుతాయని, ఆంధ్రుల పెత్తనం పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. అత్యుత్సాహం చూపే అధికారులను గుర్తు పెట్టుకుంటామని, ప్రతి దానికి సరైన సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని, నిరసనలు చెప్పడానికి పోలీసులు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు పొందాక పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిరసన ధర్నాకు టెంట్ వేసేందుకు క్షేత్రస్థాయి పోలీసులు అనుమతించకపోడంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నేరుగా ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ఉందని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ ఆడ బిడ్డల ఆర్థిక భరోసా, ఆత్మగౌరవాన్ని నింపేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చారని, బాల్య వివాహాలను నిరోధించేందుకు 18 ఏళ్లు నిండిన వారికి పేదల పేగు బంధాన్ని కాపాడేందుకు 2014 అక్టోబర్ 2న రూ.50,116తో పథకాన్ని ప్రారంభించి దానిని రూ.లక్షా116కు పెంచి కొనసాగించారన్నారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో 44లక్షల40వేల మందికి పింఛన్ ఇచ్చారని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా పింఛన్, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు భరోసా పథకాలను, మహిళలకు కేసీఆర్ కిట్ అందించారని కొనియాడారు.
30 రోజుల్లో హైకోర్టు కౌంటర్ దాఖలు చేయకుండా నాలుగు సార్లు అవకాశం ఇస్తే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందని, అలవికాని హామీలు ఇచ్చి మహిళలను మోసగించి పథకాల రద్దుకు కుట్ర చేసిందన్నారు. తక్షణమే అఫిడవిట్ వేసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబందు, రైతు భరోసా, ఆసరా పింఛన్ రూ.4వేలు, మహిళలకు రూ.2500 ఇవ్వాలని మహిళలు గల్లా పట్టి నిలదీయాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. తులం బంగారు ఏమైందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రద్దు కోసం చేస్తున్న కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టేందుకు నిర్వహించిన కదన భేరీకి మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి మహిళకు రూ.2500 ఇంకెప్పుడు ఇస్తారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రాంరాం చేస్తే భారీ మూల్యం తప్పదని, అసమర్ధ ప్రభుత్వం దిగిపోవాలని ప్రాంగణమంతా నినాదాలతో మార్మోగింది. వివిధ వాడల నుంచి స్వచ్ఛందంగా భారీగా మహిళలు తరలివచ్చారు. కేసీఆర్ సార్ మళ్లీ రావాలనే పాటకు పెద్దఎత్తున మహిళలు నృత్యాలు చేశారు.