వనపర్తి, జూన్ 4(నమస్తే తెలంగాణ) : తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సీ ఎం పర్యటన పేరుతో నిర్బంధించడం ఎంత వరకు సమంజసం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం ప్రాజెక్టుల బాట పేరుతో పర్యటన చేస్తున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా పలువురు నాయకులను పోలీసులు నిర్బంధించడంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించారు. విపత్తుల సమయం లో ఎలాంటి పర్యటనలు చేయకుండా ఇప్పుడెందుకు పర్యటన చేస్తున్నారో చెప్పాలన్నారు.
ఇప్పటికీ కల్లాల్లోనే వడ్లు ఉన్నాయని, రైతు భరోసా అడుగుతారని సీఎం హెలిక్యాప్టర్‌లో పర్యటన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆశలు వదులుకున్నారని, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందనే భ్రమలను తెలంగాణ ప్రజలు తొలగించుకున్నారన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, భవిష్యత్‌లో వారికి ప్రజల నుంచి పరాభవం తప్పదన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సందర్భంలోనే సీఎం ప్రాజెక్టుల బాట పేరుతో పర్యటన చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డనంటూ మూడేళ్లుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి తీయని రేవంత్‌రెడ్డి ఇప్పుడు వచ్చి ఏం ఒరగబెడతాడో చెప్పాలన్నారు. వట్టెంలో మోటర్లు మునిగిపోయినా కన్నెత్తి చూడకుండా కనీసం వాటి మరమ్మతులు కూడా చేపట్టకుండా వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కాలానికి కండ్లు తెరిచిందా అని ప్రశ్నించారు. కాగా సీఎం పర్యటన సందర్భంగా అరెస్టు చేసిన తెలంగాణ వాదు లు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.