వనపర్తి టౌన్, ఏప్రిల్ 27 : వరంగల్ సభలో కేసీఆర్ చేసే దిశానిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు వేచి చూస్తున్నారని, ఈ సభ చారిత్రాత్మకంగా నిలువబోతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రలో రజతోత్సవ సభ చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు.
కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పతనం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. కేసీఆర్ దిశానిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, బీఆర్ఎస్ సభల నిర్వహణలో తన రికార్డు తానే బద్దలు కొట్టుకొని చరిత్రలో కొత్త రికార్డు సృష్టిస్తుందన్నారు. అనంతరం వరంగల్ రజతోత్సవ సభకు నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నందిమళ్ల అశోక్, రమేశ్‌గౌడ్, రాజు, నర్సింహ, విష్ణు, గిరి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.