మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా గులాబీ శ్రేణుల్లో జోష్ నిండిం ది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడన్న విషయం తెలుసుకున్న పార్టీ కా ర్యకర్తలు, నాయకులు, షాద్‌నగర్ నుంచి అభిమానులు కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా తరలివచ్చారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి చేరుకొని నవీన్‌కుమార్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం అధికారికంగా విజయం సాధించినట్లు కలెక్టర్ రవినాయక్ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని నవీన్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి బయటకు రాగానే బీఆర్ఎస్ శ్రేణుల జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. అక్కడి నుంచి న్యూటౌన్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు పూలదండలు వేస్తూ గులాబీ పూలవర్షం కురిపిస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. డప్పులు కొడుతూ స్వీట్లు పంచుతూ పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ కార్యకర్తల సంబురాలు అంబరాన్నంటాయి.