సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమీద రాతలేనని కొన్ని పాఠశాలలు రుజువు చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు అటుంచితే 50 ఏండ్ల కిందట నిర్మించిన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి దినదిన గండంగా మారింది. ఎప్పుడు కూలిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. కొత్త పాఠశాలను నిర్మించాలని, లేదంటే భవనం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కొల్లాపూర్, జూలై 7 : ప్రాణాలను ఫణంగా పెట్టి కూలిపో యే దశలో ఉన్న పాఠశాలకు తమ పిల్లలను పంపించబోమని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో 50 ఏండ్ల కిందట నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 118 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల కూలిపోయే స్థితిలో ఉన్నది. వర్షాల ధాటికి పెచ్చులూడుతున్నాయి. శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మా పిల్లలను పం పించాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వర్షం వచ్చిన ప్రతీసారి పిల్లలు ఎలా ఉన్నారోనని భయాందోళనకు గురికావాల్సి వస్తుందంటున్నారు. భవనం పైకప్పు నుం చి వర్షపు నీరు కారుతున్నది. ఉపాధ్యాయులు కూడా భయంగానే పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు.
మా పిల్లలను ప్రైవేట్ పాఠశాల కు పంపించేంత డబ్బులు మాకాడ లేవు. గవర్నమెంట్ స్కూల్కు పిల్లలను పంపించేందుకు చానా కష్టా లు పడుతుండం. కానీ స్కూల్ క ట్టి చానా ఏండ్లు అయ్యింది. ఎప్పుడు కూలిపడుతుందో తెల్వ దు. అందుకే పిల్లలను పంపించాలంటే భయమైతుంది. సారోళ్లు పాఠశాల భవనం మారిస్తే బాగుంటది.
వర్షం వచ్చిన ప్రతీసారి బడిలోకి నీళ్లు వస్తున్నాయి. భవనం పెచ్చులూడుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద కూలుతుందో అని భయపడుతున్నాం. ఏమవుతుందోనని మా తల్లిదండ్రులు మమ్మల్ని పాఠశాలకు పంపిస్తలేరు. కొత్త బడిని కట్టిస్తే బాగుంటుంది.
అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరమ్మతులు చేపడుతాం. రూ.లక్ష మంజూరు కోసం నివేదికలు పంపించాం. ఇంజినీరు అధికారిని పంపించి పాఠశాల పరిస్థితిపై అంచనా వేయిస్తాం. పాఠశాల శిథిలావస్థకు చేరడంతో పెచ్చులూడుతున్న గదిలో విద్యార్థులను కూర్చోబెట్టడం లేదు. ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం.