మరికల్, జూన్ 24 : కోడలు పెట్టే వేధింపులు భరించలేక అత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని గాజులయ్య తండాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాజులయ్య తాండాకు చెందిన సకీరమ్మ(67) కు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, చిన్న కుమారుడు గేనూ నాయక్, కోడలు జయమ్మ, మనుమడు జయపాల్ నాయక్ సకిరమ్మను తరచూ వేధిస్తుండేవారన్నారు.
దీంతో సోమవారం రాత్రి కోడలు జయమ్మ భౌతిక దాడులు చేయడంతో బాధలు భరించలేక మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. పెద్ద కుమారుడు రాంసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు.