ఊట్కూర్,ఏప్రిల్ 08: దేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, సామాన్య ప్రజానికం పట్ల నియంతృత్వ పాలనను కొనసాగిస్తుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం, మండల కార్యదర్శి చెన్నప్ప అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో పార్టీ జెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్డీఏ పాలనలో మైనారిటీలు, యువకులు, మహిళల పట్ల దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల హక్కులను హరించి మతోన్మాద రాజకీయాలను ప్రేరేపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు కంపెనీల్లో విద్యాసంస్థల్లో రిజర్వేషన్ విధానం లేదని, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పార్లమెంటు స్థానాలను కుదిస్తుందని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కనకరాయుడు, రాజు, బాలప్ప, అంజప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.