Anganwadi Centre | మాగనూర్, డిసెంబర్ 23: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందుకు ఏటా రూ. కోట్లల్లో ఖర్చు చేస్తోంది. వీటిని పర్యవేక్షించేందుకు ఐసీడీఎస్ వంటి ఒక విభాగాన్నే ఏర్పాటు చేసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా లక్ష్యమే దరి చేరే పరిస్థితులు కన్పించడం లేదు. ముఖ్యంగా మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
అసలు అంగన్వాడీ కేంద్రాలను ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియకుండా ఉందని గర్భిణులు, బాలింతలు వాపోతున్నారు. పాఠశాలలు మూసేసినా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ మాగనూరు మండల పరిధిలోని అమ్మపల్లి, వడ్వట్ గ్రామంలోనికి నాల్గవ సెంటర్ లో అంగన్ వాడీ టీచర్ అయిన రాధా బాయ్ అవేవీ పట్టనట్టు అంగన్వాడీ కేంద్రాలకు తాళం వేసి మూసేశారు. దీనివల్ల గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందని ద్రాక్ష అయింది.
ఒకవేళ కొన్ని కేంద్రాలను తెరిచినా పంపిణీ చేసే గుడ్లు చిన్నపాటి గోళీల పరిమాణంలో ఉన్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ‘మాకు వచ్చే గుడ్లు అలానే వస్తున్నాయి. ఏం చేయమంటారు’ అంటూ దబాయిస్తున్నారని గర్భిణులు, బాలింతలు అంటున్నారు. మరోవైపు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్కు పై అధికారుల అండదండలు ఉండటంతో ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అడిగే వారు లేకపోవడంతో అతడు సరఫరా చేసిన గుడ్లనే సిబ్బంది తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు వడ్వట్ కేంద్రాల్లో గత రెండు నెలలుగా ఆహార పదార్థాలను తయారు చేయాల్సి ఉండగా రాధాబాయి, అందులో పని చేస్తున్న ఆయమ్మ ఇద్దరి మధ్య జరిగే గొడవలకు ఆయమ్మ పూర్తిగా అంగన్వాడి కేంద్రానికి రాకుండా పోవడంతో విద్యార్థులకు వండిపెట్టి నాధుడే లేకపోయారు తెలుస్తోంది.
చార్జి మెమో జారీచేసినా..
గత కొన్ని నెలలుగా ఈ తంతు సాగుతున్నా ఆయమ్మకు అంగన్వాడీ టీచర్ కు చార్జి మెమో జారీచేసినా వారి తీరు మారడం లేదని.. దీనివల్ల అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందక తీవ్ర నష్టపోతున్నారు. ఇదంతా కొన్నాళ్లుగా జరుగుతున్నా అటువైపుగా ఉన్నతాధికారులు పరిశీలన చేసిన దాఖలాలు కన్పించడం లేదు.
కాగా దీనిపై అంగన్వాడీ సీడీపీఓ సరోజినిని వివరణ కోరగా వడ్వట్లో నాలుగవ సెంటర్లో ఇష్యూలు ఉన్నాయని వారి తీరు మారకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అమ్మపల్లి అంగన్వాడి కేంద్రం విధులు సక్రమంగా నిర్వహించకపోతే నోటీసులు జారీ చేస్తామని సిడిపివో తెలిపారు.
