నారాయణపేట, అక్టోబర్ 27: 30 ఏండ్లుగా ధర్నాలకే పరిమితమైన నారాయణపేట సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వపరం చేయడమే కాక, అందులో ఏండ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని పర్మినెంట్ అయ్యాయి. ధన్వాడ మండల కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి జిల్లాకు గురువారం మరో తీపి కబురు అందించారు. జిల్లాకు అగ్రికల్చర్,పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసి ఈ ప్రాంత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. నారాయణపేటకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైన విషయాన్ని గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కానుండడంతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాల కంటే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల కోర్సులకు డిమాండ్ ఉంది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉండడంతో ఈ కోర్సు చేయడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. అలాంటి డిమాండ్ కలిగిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కానుండడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ధన్వాడలో సంబురాలు
మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు కావడంపై గురువారం టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి తీరని సమస్య నేడు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చొరవతో తీరిందన్నారు. విద్యార్థుల కల నెరవేరిందన్నారు. శుక్రవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పటాకులు కాల్చారు. కార్యక్రమంలో మండల కోశాధికారి నారాయణస్వామి, నాయకులు పటేల్ నర్సింహులు, వడ్ల శాంతికుమార్, యూత్ అధ్యక్షుడు సునీల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సచిన్, వీరేశ్‌కుమార్, షాకీర్‌హుస్సేన్ పాల్గొన్నారు.