నారాయణపేట టౌన్, డిసెంబర్ 12: సబ్జెక్టుపై పట్టు సాధించడానికి అధ్యాపకులు వివిధ మార్గాలను వినియోగించుకోవాలని విద్యా ప్రణాళిక-పాఠ్యపుస్తక విభాగం(ఎన్సీఈఆర్టీ) విశ్రాంత ప్రొఫెసర్ నన్నూరు ఉపేందర్ అన్నారు. పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిరం ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న నూతన జాతీ య విద్యావిధానం-2020 వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నూతన విద్యావిధానంలోని అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఈపీ విధానం ద్వారా పాఠశాల ఆధారిత మూల్యాంకనం పరీక్షలను తరగతి బోధనలో విలీనం చేయడం జరిగిందని, రోట్ పద్ధతుల నుంచి దూరంగా నిర్మాణాత్మక అంచనా ద్వారా నేర్చుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు అభివృద్ధి స్వతహాగా చేసుకోవాలని, విద్యార్థి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్నారు. పుస్తకాలను చదువడం, ఇంటర్నెట్ ద్వారా సబ్జెక్ట్‌లోని నూతన అంశాలపై పట్టుసాధించాలని సూచించారు. విద్య ఆధారంగానే ప్రపంచంలోని జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రతంగపాండురెడ్డి, సరస్వతీ విద్యాపీఠం కరస్పాండెంట్ విద్వాన్‌రెడ్డి, ప్రాంత శైక్షణిక్ ప్రముఖ్ కృష్ణమాచార్యులు, విభాగ కార్యదర్శి ఎల్లప్ప, జిల్లా అధ్యక్షుడు బాలరాజు, సభ్యులు పగడాకుల శ్రీనివాసులు, సీతారాములు, పాఠశాల ప్రధానాచార్యులు దత్తూచౌదరి, ఉమ్మడి జిల్లాలో ని శిశుమందిరాల ఆచార్యులు, మాతాజీలు పాల్గొన్నారు.