నారాయణపేట, మే 10: ‘నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం కాదు..ఎనిమిది సంవత్సరాలుగా నీవు ఎమ్మెల్యేవు..నేను ఎమ్మెల్యేను..రాయిచూర్‌కు నీవు చేసిన అభివృద్ధి ఏమిటో… అదే నారాయణపేటకు నేను చేసిన అభివృద్ధి ఏమిటో తనవెంట వస్తే చూపిస్తానని, అవసరమైతే రాయిచూర్ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తా అక్కడి జర్నలిస్టులతో పాటు నీవు వస్తే కళ్లారా చూపిస్తా’ అని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మంగళవారం రాయిచూర్ అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్‌కు సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కర్ణాటక ప్రజలు కోరుతున్నారని, రాయిచూర్ను తెలంగాణలో కలపాలని రాయిచూర్ అర్బన్ చెందిన బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ కొన్ని నెలల కిందట అన్న మాటలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ నష్టనివారణను కప్పి పుచ్చుకునేందుకు ఇటీవల నారాయణపేటలో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సభలో ఎమ్మెల్యే పాటిల్‌ను రప్పించి మాట్లాడించారు. రాయిచూర్ను తెలంగాణలో కలపాలని తాను ఏదో జోక్‌గా అంటే దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకున్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అంతే కాకుండా పేటలో తాను ఎలాంటి అభివృద్ధి చేయలేదని తన ఓటమికి ప్రచారం చేస్తానని చెప్పడంపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కేటీఆర్ సభలో ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్ అనుమతిస్తే 24గంటల్లో రాయిచూర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి వాస్తవ విషయాలు వెల్లడిస్తానని ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి తన ప్రసంగంలో తెలిపారు.
చెప్పినట్లుగా 24గంటల్లోనే రాయిచూర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నలను సంధించారు. దేశంలో అత్యంత చెత్త పట్టణాల జాబితా రూపొందిస్తే టాప్ టెన్‌లో రాయిచూర్ ఉంటుందని, ఇది ఒక్కటి చాలు రాయిచూర్ ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమన్నారు. ఎనిమిది ఏండ్లుగా కేంద్రం నుంచి రాయిచూర్‌కు ఒక్క అభివృద్ధి పని కూడా తీసుకురాలేదన్నారు. 2015లో మంజూరైన తాగునీటి పథకాన్ని నేటి వరకు తొమ్మిది సార్లు గడువు పెంచుతూ పూర్తి చేయలేదన్నారు. ఇప్పటికైనా వాస్తవ విషయాలను గుర్తించి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాకుండా అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్ చేశారు. వీటినే రాయిచూర్ ప్రజలైనా, నారాయణపేట ప్రజలైనా కోరుకునేది అని అన్నారు.