– మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో వెల్లువెత్తుతున్న నారాయణపేట- కొడంగల్ భూ నిర్వాసితుల నిరసనలు
– తమను పట్టించుకోకపోతే చావే శరణ్యమంటున్న నిర్వాసిత కుటుంబాలు
ఊట్కూర్, జూలై 21 : రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా వ్యవసాయ భూములు కోల్పోతున్న అనేక మంది రైతులు తమకు నష్ట పరిహారం అందించడంలో అటు అధికారులు కానీ, ఇటు ప్రజా ప్రతినిధులు గానీ శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా తమ వ్యవసాయ భూములను పోలీసులను అడ్డంపెట్టి బలవంతంగా తీసుకున్న ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించి ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. మక్తల్, ఊట్కూర్ మండలాలకు చెందిన అనేక మంది రైతులు సోమవారం ఉదయం నుండి తమ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ నిరసన కార్యక్రమం పేరుతో “మంత్రి గారు మాకు న్యాయం చేయండి” అంటూ తమ తమ ఇళ్ల వద్ద నుండి ఫ్లకార్డుల ప్రదర్శనతో మంత్రి వాకిటి శ్రీహరికి విజ్ఞప్తి చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు తమ నిరసనను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తున్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు సన్న, చిన్నకారు కుటుంబాలు కావడంతో ఉన్న కొద్దిపాటి ఎకరా, రెండు ఎకరాల భూములు పూర్తిగా కోల్పోయి ఉపాధి మార్గాలు లేక రోడ్డున పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు మాటమాత్రమైన సమాచారం ఇవ్వకుండానే ఎకరాకు రూ.14 లక్షల చొప్పున మొఖాన కొట్టి బలవంతపు భూసేకరణ చేపట్టడం ఎంతవరకు సమంజసమని రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మరోపక్క నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి సైతం పలు సందర్భాల్లో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఎంతైతే ప్రభుత్వం అందిస్తుందో తన నియోజకవర్గం మక్తల్లో కూడా అంతే మొత్తంలో రైతులకు అందించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చడంలో మంత్రి విఫలమైనట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి తమను పట్టించుకోకపోతే చావే శరణ్యం అని పేర్కొంటున్నారు.
భూముల బేసిక్ ధరను నిర్ణయించుటకు కమిషన్ ఏర్పాటు చేయాలని, కమిషన్ నిర్ణయించిన బేసిక్ ధరకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. బలవంతపు భూ సేకరణను ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు కుటుంబ సభ్యులతో కలిసి తమ నిరసనను కొనసాగిస్తామని భూ నిర్వాసిత రైతు కుటుంబాలు తెలిపాయి. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎకరాకు రూ.50 లక్షల నుండి రూ.70 లక్షల వరకు పరిహారం అందజేయాలని, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
కాగా, అధికారులు మాత్రం ఎకరాకు రూ.14 లక్షలు ఫైనల్ గా నిర్ణయిస్తూ నియోజకవర్గంలోని కొందరు రైతులకు చెక్కులను అందించడం భూ నిర్వాసిత రైతు కుటుంబాలను మరింత ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు ఏమాత్రం సరిపోదని, ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు తిరస్కరిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు అఖిలపక్ష పార్టీల నాయకుల మద్దతును కూడగట్టి తమకు అందాల్సిన న్యాయమైన డిమాండ్ల సాధనకు అడుగులు వేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మక్తల్ మండలం కాచ్వార్, ఎర్నాగన్ పల్లి, కాట్రేవు పల్లి, ఊట్కూర్, బాపురం, తిప్రాస్ పల్లి, జీర్ణహళ్లి, పులి మామిడి, పెద్ద పొర్ల తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో భవిష్యత్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.