మరికల్, మే 31: మరికల్ (Marikal ) మండల కేంద్రంలో 15 రోజుల క్రితం ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టిన సంఘటనలో మరొకరు మృతిచెందారు. ఈ నెల 15న మరికల్ పట్టణంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం అతడు కూడా మృతి చెందినట్లు మరికల్ ఎస్ఐ రాము తెలిపారు.
ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగలి శ్రీనివాసులు అదే రోజు మృతి చెందారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంధ్యాల గ్రామానికి చెందిన శివారెడ్డి (41) తీవ్ర గాయాల పాలవగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 15 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. శివారెడ్డి మృతితో ఉంధ్యాల గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.