Maganur | మాగనూరు, అక్టోబర్ 4: మాగనూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా ఇసుక తోడేస్తున్నారు. మాగనూరు మండల కేంద్రంతో పాటు కృష్ణ, మక్తల్ మండలాలకు తరలిస్తున్నారు. మరో వైపు మాగనూరు మండల పరిధిలోని అడవి సత్యారం గ్రామంలో రాత్రి 7 గంటల మధ్యలో అందరూ చూస్తుండగానే జేసీబీని పెట్టి ఇసుక తోడి ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదేమని అడిగితే.. ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి అధికారుల కండ్లు కప్పుతున్నారు. ఈ ఇసుక అక్రమ దందాకు దీనికి తోడు మండల ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయి. ట్రాక్టర్లు పట్టుకున్న పది నిమిషాలకే ఎలాంటి జరిమానా లేకుండానే విడిపించుకుని తీసుకెళ్లడంతో.. ఇసుక మాఫియా ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. అయితే, అడవి సత్యారం గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై తహసీల్దార్ సురేష్‌ను వివరణ కోరగా.. మాగనూరు ఎస్ఐకి సమాచారం అందించి ఎవరైతే ఇసుక తరలిస్తున్నారో వారి జేబీసీ, ట్రాక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచిస్తామన్నారు.