Illegal Gambling | మాగనూరు, జూలై 03: నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ మండలాల్లో జోరుగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. లక్షల రూపాయల లావాదేవీలతో పేకాట శిబిరాలు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాగనూరు మండల పరిధిలోని మంది పల్లి, వడ్వట్, పెగడబండ, నేరడగం, ఉజ్జలి, నేరడగం దొడ్డి,కృష్ణ మండల పరిధిలోని చేగుంట, హిందూపూర్, మూడు మాల్, టైర్డ్, వాసునగర్ ప్రాంతాలలో జోరుగా పేకాట కొనసాగుతోందని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.
పేకాట వ్యసనానికి బానిసలైన పలువురు తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేసుకుంటున్నారని.. అప్పుల పాలై ఇళ్లలో కలహాలు, కుటుంబ విభేదాలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ భూములు, బంగారం, ఇతర ఆస్తులను కూడా విక్రయించి పేకాటలో పోగొట్టుకుంటున్నారని అంటున్నారు. అక్రమ పేకాట స్థావరాలపై వెంటనే ప్రత్యేక దాడులు నిర్వహించి నిర్వాహకులు, పాల్గొనేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి అక్రమ పేకాటకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.