మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఆది హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి రథోత్సవం (Rathotsavam) అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం ఆది హనుమాను దేవాలయం దగ్గర రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ బాజా భజంత్రీలతో స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం అర్చకులు జగదీశ్వర్, చంద్రశేఖర్ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
మార్కండేయ పల్లకి సేవ..
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సంఘం వారు ఘనంగా పక్ష మార్కండేయ పల్లకి సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను పంచామృతాభిషేకాలను నిర్వహించిన అనంతరం పురవీధుల గుండా పల్లకి సేవ చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కృష్ణయ్య, సదన్ రావు, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, పెయింటర్ శ్రీనివాస్, సుదర్శన్, తిరుపతయ్య, నరేష్, శ్రీనివాసులు, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.