స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశం దుమారం రేపుతున్నది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణను ప్రారంభించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణించింది. బాధ్యులు తుపాకీతో కాల్చడంతో న్యాయవ్యవస్థ రక్తమోడు తున్న దని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం విచారం వ్యక్తం చేస్తూ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకొంటామని హామీనిచ్చింది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని నాలుగో చాప్టర్లో ‘ది రోల్ ఆఫ్ జ్యుడీషియరీ ఇన్ అవర్ సొసైటీ, యాజ్ ఏ గ్రేవ్ మ్యాటర్’ పేరిట ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ జరుగుతున్నట్టు ఓ పాఠాన్ని ముద్రించింది. న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిల్లో అవినీతి పేరుకుపోయిందని, ఇది వెనుకబడిన వారికి న్యాయాన్ని దక్కకుండా చేస్తున్నదని పేర్కొంటూ ఆ పాఠ్యాంశం సాగింది. సదరు పుస్తకంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసే ఏ చర్యనూ సహించబోమని తేల్చి చెప్పింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి గురువారం విచారణను కొనసాగించింది.
పుస్తకం దుమారం నేపథ్యంలో కేంద్రం స్పందించింది. న్యాయవ్యవస్థను అగౌరపర్చాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన.. ఎన్సీఈఆర్టీపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకొంటామన్నారు. కాగా, దుమారం నేపథ్యంలో ఇప్పటికే పుస్తకాల అమ్మకాలను నిలిపేసిన ఎన్సీఈఆర్టీ.. అసంబద్ధ అంశాలను ప్రచురించినందుకు క్షమాపణలు తెలిపింది. నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు కారణంగానే ఇది జరిగినట్టు పేర్కొన్నది.