నారాయణపేట: నారాయణపేట జిల్లాలో (Narayanapet) యూరియా కొరత వేదిస్తున్నది. పంట పొట్టకొస్తుండటంతో యూరియా కోసం రైతులు రాత్రనక, పగలనక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరికల్ మండలం తీలేరు సహకార సంఘం కార్యాలయానికి పెద్ద సంఖ్యలో రైతులు చేరుకుని క్యూలైన్లలో వేచిఉన్నారు. అర్ధరాత్రి నుంచే రైతులు, మహిళలు, చిన్నారులు లైన్లలో నిల్చున్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో తాము పిల్లాపాపలతో ఇక్కడికి వచ్చామని, ఆకలితో అలమటిస్తూ ఎదురుచూస్తున్నా యూరియా దొరకడం లేదని ఓ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.
నారాయణపేట్ట పట్టణంలోని ప్రాథమిక సహకార కేంద్రం వద్ద రైతులు అర్ధరాత్రి నుంచి వేసి ఉన్నారు. నిలబడే ఓపికలేకపోవడంతో చెప్పులను లైన్లో పెట్టి పక్కకు కూర్చున్నారు. ఇక మద్దూరు పట్టణ కేంద్రంలోని పీఏసీఎస్ ఆఫీస్ ముందు యూరియా కోసం ఆదివారం రాత్రి 12 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో సోమవారం ఉదయం ఎస్ఐ విజయ్ కుమార్ సమక్షంలో టోకెన్లు పంపిణీ చేశారు.