మరికల్, ఆగస్టు 22: నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలో యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి 205 యూరియా బస్తాలు వచ్చాయి. దీంతో యూరియా కోసం వచ్చిన రైతులు తమ పట్టా పాస్ పుస్తకాలు క్యూ లైన్లో ఉంచారు. బస్తాకు రూ.267 చొప్పున రైతుకు మూడు బస్తాల యూరియాను పంపిణీ చేశారు.
కోయిల్ సాగర్ తీర ప్రాంతంలో రైతులు అధిక మొత్తంలో వరి సాగు చేస్తుండం వల్ల యూరియా ఇబ్బంది ఏర్పడింది. ప్రభుత్వం సరిపడా యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మేర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర క్యూలో నిలబడి తీసుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఏరియా కృత్రిమ కొరత ఏర్పడిందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు అందుబాటులో ఉంచి ఇబ్బందులను తీర్చాలని రైతులు కోరుతున్నారు.