మాగనూరు (కృష్ణ) అక్టోబర్ 08: స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ‘కాంగ్రెస్ బాకీ’ కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రజలకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో గ్యారెంటీల జాడే లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టి రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దాదాపు రెండేండ్లు కావస్తున్నా హామీల అమలు ఊసెత్తడం లేదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని, గ్యారెంటీ కార్డులు దగ్గర పెట్టుకోవాలని, అమలుకాకపోతే తమను నిలదీయాలని రేవంత్‌రెడ్డి ఆ నాడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ కార్డుల ప్రకారమే ఎవరెవరికీ ఎంత బాకీ ఉన్నారో తెలిసేలా ‘కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు’ రూపంలో ప్రజలకు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ హామీలన్నీ కూడా రేవంత్‌రెడ్డితోపాటు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గేలు కూడా ఇచ్చారని, వీరంతా బాధ్యులేనని స్పష్టంచేశారు. వీటన్నింటిపై ప్రభుత్వాన్ని ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు విజయానికి ఒక సైనికుడిలా పని చేసి పార్టీ విజయానికి కారకులు కావాలన్నారు.
అనంతరం కృష్ణ మండల కేంద్రంలోనీ బ్రాహ్మణి వాడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే చికెన్ రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాగనూరు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు రాజులసిరెడ్డి కృష్ణ మండల బిఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పాటిల్, ఈశ్వర్ యాదవ్, చేగుంట శివప్ప, శంకర్ నాయక్, మల్ రెడ్డి, మోనేష్, అమ్రేష్, వెంకటేష్ అంజి కృష్ణ ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.