ఊట్కూర్, ఏప్రిల్ 02 : రోడ్డుపై పది రూపాయల నోటు కనిపిస్తే చాలు అదృష్టం వరించిందని చుట్టూరా చూసి చప్పుడు కాకుండా జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో ఓ బీఆర్ఎస్ యూత్ నాయకుడు తనకు దారిలో దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ యూత్ మండల ప్రెసిడెంట్ డీకే జనార్దన్ బుధవారం ఉదయం నర్వ మండల కేంద్రానికి బైక్ పై బయలుదేరాడు. బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో దారిలో రోడ్డుపై పర్సు కనిపించింది. బైక్ ఆపి పర్సును పరిశీలించాడు.
పర్సులో నగదు ఉన్న విషయాన్ని గుర్తించి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు పర్సులో రూ.10,000 ఉన్న నగదుతో పాటు బాధితుడికి సంబంధించిన ఆధార్ కార్డు, ఎటిఎం కార్డు ఉండడంతో వాటి ఆధారంగా లంకాల గ్రామానికి చెందిన సాయికుమార్విగా గుర్తించి బాధితుడికి అందజే శారు. పెద్ద మొత్తంలో డబ్బులు దొరికిన కూడా పోలీసులను సంప్రదించి డబ్బులు బాధితుడికి చేరేలా చొరవ చూపుతూ నిజాయితీని ప్రదర్శించిన జనార్దన్ ను మండల బీఆర్ఎస్ నాయకులు విజయకుమార్, మహేందర్, నర్సింహా తోపాటు స్టేషన్ సిబ్బంది అభినందించారు.