ఊట్కూర్, ఆగస్టు 04: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కడుపు నింపి.. కర్షకుల పొట్ట కొడుతోందని అఖిలపక్ష పార్టీల నాయకులు మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, ఎం భాస్కర్, వెంకట్రామ రెడ్డి ఫైర్ అయ్యారు. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం పనులను మెగా కంపెనీ, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు అప్పగించిన ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురిచేసి పోలీసు పహారాలో భూ సేకరణ సర్వేను పూర్తి చేసిందన్నారు.
కాగా, ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు భూ పరిహారం అందించడంలో తీవ్రమైన అన్యాయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల న్యాయమైన హక్కుల కోసం పోరాడేందుకు పార్టీలకతీతంగా సిద్ధమైనట్లు తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని ఏ ఏ గ్రామాలకు సాగు నీటిని అందిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వకుండా కేవలం కొడంగల్ కు సాగు నీటిని తరలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ నష్టపరిహారం అందించడంలో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు పాల్పడిన ప్రభుత్వం నెల రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని వివిధ మార్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు.
పరిహారం పెంచమని అడుగుతున్న రైతులను నారాయణపేట ఆర్డిఓ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. భూ నిర్వాసితులకు కేవలం ఎకరాకు రూ.14 లక్షల పరిహారం అందిస్తోందని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారంతో బాధిత రైతులు మార్కెట్ లో అర ఎకరా భూమి దొరకదన్నారు. నిర్వాసితులకు సరైన పరిహారం ఇప్పించడంలో మంత్రి వాకిటి శ్రీహరి పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు. మక్తల్ రైతులకు చెంతనే కృష్ణా నది పారుతున్నప్పటికీ చుక్క నీటిని వాడుకోకుండా సీఎం పైప్ లైన్ ద్వారా తన స్వంత నియోజకవర్గానికి సాగు నీటిని తరలిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు ఏర్పడి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు.
భూ నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే కమిషన్ ను ఏర్పాటు చేయాలని, 2013 భూ సేకరణ చట్టం అమలు మేరకు రైతులకు ఎకరాకు రూ. 60 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసిత రైతులకు మద్దతుగా అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 6 వ తేదీ నుంచి పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం పై పోరాడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ హనుమంతు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోరం శివకుమార్ రెడ్డి, వడ్ల మోనప్ప, ఉబేదుర్ రహిమాన్, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మరాజు గౌడ్, గోపాల్ రెడ్డి, తరుణ్, షేక్ షమీ తదితరులు పాల్గొన్నారు.