Narayanapet | మాగనూరు, జూన్ 17 : అనుమతుల మేరకు మాత్రమే ఇసుక తరలించాలని అనుమతులకు మించి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ ఆర్ఐ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మాగనూరు మండల పరిధిలోని వర్కూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న టిఎస్ఎండిసి ఇసుక రీచ్‌ను మైనింగ్ ఆర్ఐ ప్రతాపరెడ్డి, టిఎస్ఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీకాంత్, మైనింగ్ సర్వైర్ లక్ష్మీనారాయణ కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మైనింగ్ ఆర్ఐ మాట్లాడుతూ… అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇసుక తరలిస్తున్నారని మా దృష్టికి వచ్చిందని. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశాల మేరకు ఇసుక రీచ్‌లను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. అలాగే వర్కూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న టీఎస్ఎండిసి ఇసుక పర్మిషన్ ఇచ్చిన గడువు అయిపోయిందని 32 వేల క్యూబిక్ మీటర్లకు 51 మెట్రిక్ టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా వారు 16 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తరలించినట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని ఈ విషయంపై రీచ్‌లో ఇసుక ఉందా లేదా అనే విషయంపై పరిశీలించి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ తెలియజేయడంతో తదుపరి ఇసుక తరలించే విషయంపై చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అనుమతులకు మించి గాని ఎలాంటి అనుమతులు లేకుండా గాని ఇసుక తరలించినా, అలాగే దొరికిన వాహనాలు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎండిసి ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్, మైనింగ్ సర్వేయర్ లక్ష్మీనారాయణ, మాగనూరు ఆర్ఐ బాలరాజ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.