నారాయణపేటరూరల్, ఆగస్టు 21 : నారాయణపేట మండలంలోని పేరపళ్ల గ్రామంలో జాయమ్మ చెరువు పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శుక్రవారం రీసర్వే ప్రారంభమైంది. గత పదిహేను రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుసగా ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి రీసర్వేకు ఆదేశాలు జారీ చేయడంతో సర్వే ప్రక్రియను పునఃప్రారంభించారు.
ఈ మేరకు అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి భూముల రీసర్వే చేపట్టారు. ఒకో బృందంలో ఒక సర్వేయర్‌తోపాటు ఇద్దరు జీపీవోలు, ఒక ఆర్ఐని నియమించారు. సర్వేయర్ ధనవంతి ఆధ్వర్యంలోని బృందం 78వ సర్వే నెం బర్ నుంచి సర్వేను ప్రారంభించింది. సర్వేయర్ జయశంకర్ బృందం 55వ సర్వే నెంబర్ నుంచి, సర్వేయర్ రాజ య్య బృందం 93వ సర్వే నెంబర్ నుంచి సర్వే చేపట్టారు.
రీసర్వే తొలిరోజు పలు ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్స్ సక్రమంగా అందకపోవడంతో సర్వే ప్రక్రియకు కొంత అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ అధికారులు సర్వేను కొనసాగించారు. రానున్న రోజుల్లో అన్ని సర్వే నెంబర్లను పరిశీలించి భూముల వాస్తవ పరిస్థితిని నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భూములకు సంబంధించిన సమస్యలపై అదే విధంగా అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు రావడంతోనే అధికారులు స్పందించి రీసర్వే ప్రారంభించారని రైతులు హర్షం వ్యక్తం చేశారు. సర్వే ద్వారా తమ భూముల హద్దులు, విస్తీర్ణం, చెరువు పరిధిలోకి వెళ్లిన భూముల వివరాలు స్పష్టమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట తాసీల్దార్ అమరేందర్ కృష్ణ పర్యవేక్షణలో రీసర్వే కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో జీపీవో రవిశంకర్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.