బిజినపల్లి,జూలై 15: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. కాగా, దళిత సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలోని కూడలిలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లో పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని శిక్షిస్తామని ఎస్ఐ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో విజయ్, అశోక్, దశరథం, విల్సన్, నాగన్న, లక్ష్మయ్య, రాజు, కృష్ణ ప్రసాద్, రాములు, మల్లేష్, శ్రీశైలం, పరుశరాములు, నాగరాజు, అంజి, ఈశ్వర్, తదితరులున్నారు.