కందనూలు, సెప్టెంబర్ 5 : సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడని, విద్యావంతుల తయారీలో వారి పాత్ర ఎనలేనిదని జెడ్పీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా పూజించుకునే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు అందుకు గర్వపడాలని సూచించారు. జిల్లాలోని ఏ ప్రభుత్వ పాఠశాలలో సమస్య ఉన్నా, ఫర్నిచర్ కొరత ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక నిధులు సమకూర్చుతున్నదని, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 79మందిని శాలువాతో సన్మానించి మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, సెక్టోరియల్ అధికారులు సతీశ్, సూర్య చైతన్య, వెంకటయ్య, ప్రసాద్, స్ట్రాంగ్ టీచర్ వెంకటశెట్టి, సిబ్బంది నాగరాజు, జెడ్పీటీసీలు భరత్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
సర్వేపల్లి అడుగుజాడ్లలో నడుద్దాం
కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 5 : భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అడుగుజాడల్లో నడస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చుదామని పీఆర్టీయూ టీఎస్ సంఘం నాయకులు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయం వద్ద సర్వేపల్లి విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంఘం డివిజన్, మండలాల నాయకులు పాల్గొన్నారు.
యువతకు ఆదర్శం ‘ఉపాధ్యాయుడు’
ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడు చాలా ముఖ్యమైన వాడని ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు అన్నారు. వివేకానంద సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ వారి జీవితంలో నిజమైన వెలుగులు నింపి నవ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న మహానుభావులన్నారు. అనంతరం పెద్దకొత్తపల్లిలో జెడ్పీహెచ్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మద్దిలేటిని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు రామకృష్ణ, సలహాదారులు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్‌కు మార్గదర్శకులు
గురువులు భవిష్యత్‌కు దారి చూపే మార్గదర్శకులని వాసవీ క్లబ్ వెల్దండ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ఉపాధ్యాయులను ఆయన పూలమాల, శాలువాలతో సన్మానించారు. అంతకుముందు సర్వేపల్లి రాధకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోచయ్య, బ్రహ్మయ్య, వెంకటయ్య, ప్రసాద్‌గౌడ్, క్లబ్ సభ్యుడు శ్రీనివాసులు తదితరులున్నారు.
తెలకపల్లి మండలంలో..
మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని ఎమ్మార్సీ భవనం వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతలు సావిత్రీబాయి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మల్లేశ్, భాస్కర్, సతీశ్, బాలీదన్న తదితరులున్నారు.