Vijay -Rashmika | టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట పెళ్లి వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ జంట నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ నెల 26న వీరి వివాహం జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. అభిమానులు, సినీ వర్గాలు ఈ విషయంపై ఆసక్తిగా చర్చించుకుంటుండగా, ఇప్పుడు మరో సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో హక్కుల కోసం ఏకంగా రూ.60 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో స్టార్ హీరోయిన్ నయనతార – దర్శకుడు విగ్నేశ్ శివన్ వివాహానికి సంబంధించిన డాక్యుమెంటరీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.25 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ డీల్‌ను మించి, దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని విజయ్–రష్మిక జంటకు ఆఫర్ చేయడం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ మెగా ఆఫర్‌ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన, మధురమైన క్షణాలను వ్యాపార కోణంలో చూడడం తనకు ఇష్టం లేదని, పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం కావాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వేడుకను ప్రైవేట్‌గా ఉంచాలన్న నిర్ణయంతోనే ఈ ఆఫర్‌కు ‘బిగ్ నో’ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
ఇప్పటివరకు ఈ జంట పెళ్లిపై అధికారిక ధృవీకరణ రాకపోయినా, ఈ భారీ డీల్ వార్త మాత్రం వీరిద్దరికీ ఉన్న క్రేజ్‌ను మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం “ఆఫర్ ఎంత పెద్దదైనా, వ్యక్తిగత జీవితానికి ప్రైవసీ ముఖ్యమే” అంటూ విజయ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పెళ్లి వార్తల కంటే కూడా ఈ నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ టాక్ ప్రస్తుతం మరింత హాట్ టాపిక్‌గా మారింది.