కొల్లాపూర్, ఫిబ్రవరి 18: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలంలోని ముక్కిడిగుండంలో సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన నృత్యాలు, ఆటపాటలతో భోగ్ బండారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ బంజారాలు ఆరాధించే సంత్ సేవాలాల్ మహారాజ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా సేవాగఢ్లో పుట్టి, మహారాష్ట్రలోని పోరియాగఢ్లో అమరుడయ్యారని తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కోట్లాదిమంది బంజారాలు ఉత్సవాలను నిర్వహిస్తారని చెప్పారు. బంజారాలు సంచార జీవనం వదిలి స్థిర నివాసాలుగా తండాలను ఏర్పాటు చేసుకోవాలని, తమ దగ్గరున్న పశు సంపదతో వ్యవసాయం చేసి అభివృద్ధి కావాలని, మూఢ నమ్మకాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఇతర మతాల సంస్కృతి, భావాలు, బంజారాలపై పడకుండా ప్రత్యేక ఉనికిని చాటుకునేందుకు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ బంజారాలను చైతన్యం చేసిన గొప్ప సంఘసంస్కర్త, పోరాటయోధుడని కొనియాడారు.
అలాంటి మహనీయుని ఆశయాలు సాధించాలంటే ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సేవాలాల్ జయంతి రోజు జనరల్ హాలిడే ప్రకటించాలని అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన బెడుతున్నదని, ఐచ్చిక సెలవు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. గిరిజనుల సంస్కృతిని నాశనం చేసే విధంగా ఇతర మతాల సంస్కృతిని గిరిజనులపై బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో తరతరాలుగా కోట్లాదిమంది బంజారాలు తమ మాతృభాష మాట్లాడుతూ ఉనికిని చాటుకుంటున్నారని, భాషకు లిపి లేకపోవడంతో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అజ్ఞానంలో ఉన్న తోటి బంజారాలను మేల్కొల్పి వారిలో చైతన్యం నింపిన గొప్ప ఆదర్శమూర్తి సేవాలాల్ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం బంజారా భాషను భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ గురుస్వామి సుక్య నాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ అశోక్ గిరిజన, మాజీ సర్పంచ్ ఎస్ దశరథం, బోడమ్మ, లోక్య నాయక్ పాల్గొన్నారు.