నాగర్ కర్నూల్: అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామంలో గల ఎస్ఎల్బీసీ సొరంగంలో గురువారం సహాయక చర్యలు కొనసాగాయి. సొరంగంలో ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్టును పొడిగించే పనులను చేపడుతున్నారు. టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద ప్రమాద ప్రదేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం సంభవించిన ప్రాంతంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్టు ను పొడిగిస్తూ తద్వారా ప్రమాద ప్రదేశంలోని మట్టిని తవ్వే ప్రక్రియ మరింత వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. టన్నెల్ లోపల నిర్విరామంగా ఐదు ఎస్కవేటర్లతో మట్టి తవ్వకాలు చేపడుతూ సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న స్టీల్ భాగాలను టన్నెల్ బయటికి తరలిస్తున్నట్లు వివరించారు.
నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటకు తరలిస్తూ సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మావేశంలో ఆర్మీ అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు, ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారులు, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి తదితరులు పాల్గొన్నారు.