అచ్చంపేట : ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టన్నెల్లో చిక్కుకున్న బాధితులను గుర్తించేందుకు రక్షణ చర్యలను వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
సహాయక బృందాలు ప్రధానంగా టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) లోని కీలక భాగాలను ప్రత్యేక యంత్రాల సహాయంతో కత్తిరించి తొలగించడం, టన్నెల్లో చేరిన నీటిని వాటర్ జెట్ సాంకేతికత ద్వారా బయటకు పంపించడం, ఎస్కావేటర్లతో మట్టిని కన్వేయర్ బెల్ట్‌పై తరలించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సహాయక బృందాలకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్మీ అధికారులు, కల్నల్ పరీక్షిత్ మెహర, వికాస్ సింగ్, NDRF అధికారులు, డాక్టర్ హరీష్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, SDRF, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వి రోబోటిక్స్, కేరళ రెస్క్యూ బృందం, JP కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. సహాయక బృందాల సమన్వయంతో చర్యలను త్వరితగతిన అమలు చేస్తూ బాధితులకు త్వరగా సహాయం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.