బిజినేపల్లి,మే 27 : రైతులు ఎరువులు తక్కువ వాడి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో ఎప్పుడు ఒకే రకమైన పంటను వేసుకోవద్దని సూచించారు. పంట మార్పిడి, సేంద్రియ ఎరువులను వాడినట్లయితే నేలసారం పెరిగి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందన్నారు.
పంటలలో సమగ్ర చీడపీడల యాజమాన్యం వంటి పద్ధతుల గురించి వివరించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాల ఎరువుల రసీదులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా యాంత్రికరణతో పంటలను సాగు చేసినట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. రైతులు ఎప్పుడైనా పంటలు పండించడంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకే సాగు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, కళ్యాణి రైతులు ఉన్నారు.