Kollapur municipality | కొల్లాపూర్, డిసెంబర్ 3: అది నిత్యం వాహనాలు, జనాల రాకపోకలతో రద్దీగా ఉండే మెయిన్ రోడ్. డ్రైనేజీ వాటర్ మెయిన్ రోడ్డుపైకి వస్తున్నా అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొల్లాపూర్ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కొల్లాపూర్ మెయిన్ రోడ్ లైన్లోనే డ్రైనేజీ వాటర్ బయటికి పొంగిపొర్లుతుంది. దీంతో వచ్చే దుర్గంధంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజుల నుంచి డ్రైనేజీ వాటర్ మెయిన్ రోడ్డు పైకి వస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.
డ్రైనేజీ దుర్గంధంతో ఇళ్లలో ఉండాలంటే ఉండలేని స్థితి వచ్చిందని.. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మెయిన్ రోడ్ కాలనీవాసులు వాపోతున్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో గతంలో 20 వార్డులు ఉండగా ప్రస్తుతం 19 వార్డులు ఉన్నాయి. వార్డుల సంఖ్య తగ్గినా డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పడకపోవడం మున్సిపల్ అధికారుల పనితనం కొట్టొచ్చినట్లు కనపడుతుందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
కొల్లాపూర్ పట్టణంలోనే అత్యంత రద్దీగా కమర్షియల్ కాంప్లెక్సులు ఉన్న కొల్లాపూర్ మెయిన్ రోడ్డు కాలనీలోనే డ్రైనేజ్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే పట్టణంలోని మారుమూల వార్డులలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది డ్రైనేజ్ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.
Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన