నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వరి కొనుగోళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మంత్రి పీయూష్ గోయల్ వైఖరిపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. పంజాబ్‌లో వరిని కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకొనేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. దీంతో తెలంగాణలో ఈ సీజన్లో వరి పండించిన రైతులు కష్టాలపాలు కానున్నారు. దీన్ని ముందే గుర్తించిన సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానికి వివరిస్తూ వస్తున్నారు. రైతులు వరి వేయవద్దని వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. దీనివల్ల కొద్దిగా వరి విస్తీర్ణం తగ్గింది. కానీ కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గత నవంబర్‌లో జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగాయి. సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఇటీవలే రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి కలిసినా కేంద్ర మంత్రి పీయూష్ అవహేళనగా మాట్లాడారు. ఈ కారణంగా సీఎం పిలుపుతో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, సింగిల్ విండో, డీసీఎంఎస్‌లు, రైతుబంధు సమితుల ఆధ్వర్యంలో వరి కొనాలని తీర్మానించాయి. ఈ లేఖలను పోస్టాఫీసుల ద్వారా ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి పంపించాయి. అయినా కేంద్రం వరి కొనమని తెగేసి చెప్పింది. ఉగాది తర్వాత మరో విడుత ఆందోళనలు చేపడతామన్న సీఎం కేసీఆర్ మాటల ప్రకారం టీఆర్ఎస్ శ్రేణులు బరిలోకి దిగబోతున్నాయి. దీనికోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 4 నుంచి 8వ తేదీ వరకు విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్రం తీరును గ్రామ స్థాయిలో వివరించేలా ఈ ఆందోళనలు కొనసాగనున్నాయి. సోమవారం మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు. టీఆర్ఎస్ నాయకులతో పాటుగా రైతులు పాల్గొని దీక్షలకు మద్దతు ఇవ్వనున్నారు.
6న జాతీయ రహదారులపై రాస్తారోకోలు, 7న జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరగనున్నాయి. భారీ ఎత్తున దీక్షలకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 8వ తేదీన మరింత వినూత్న ఆందోళనలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వదిష్టి బొమ్మలను దహనం చేయనున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలంతా ఈ ఆందోళనలో భాగస్వాములు అయ్యేలా టీఆర్ఎస్ గ్రామ పార్టీలకు సూచించింది. దీంతో పాటుగా ప్రతి ఇంటిపై నల్లజెండాలను ఎగురవేయనున్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులంతా ఈ నల్లజెండాలను ఎగురవేసి కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేయనున్నారు. 11న సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఇలా తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పార్టీ నాయకులు మరోసారి పోరాటాలకు దిగనుండటంతో రైతులూ స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఈ వారం టీఆర్ఎస్ వరి పోరుతో ఉద్యమబాట పట్టనుండటంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
రైతుల కోసమే పోరుబాట
రైతుల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నా యి. కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ పంజాబ్ వరి కొంటూ మన రైతులు పండించిన ధాన్యాన్ని కొనకపోవడం అన్యాయం. ఇక్కడి ప్రజలు, రైతులు రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంపై పోరాటాలకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా రైతుల కోసం చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొనాలి.
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్