ఎండా కాలం ప్రారంభంలోనే ధరల మంటలు భగ్గుమన్నాయి. ‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’..ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సామాన్యుల నెత్తిపై బీజేపీ ప్రభుత్వం ధరల పిడుగు వేసింది. వంట గ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను సైతం ఒక్కసారిగా, ఒకే రోజు పెంచింది. సిలిండర్‌పై రూ.50 పెంచగా.. ధర రూ.వేయి దాటింది. ఇక పెట్రోల్,డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెరిగింది. మరోవైపు వంటనూనెలు సలసలా కాగుతుండగా.. మిర్చి ఘాటెక్కిస్తుంది..చికెన్ ధరలు ఆకాశాన్నంటి.. కిలో రూ.300కు చేరువైంది. ధరాభారం చూసి పేదలు, సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. దీనికితోడు సందట్లో సడేమియాలాగా కల్తీ మాఫియా మార్కెట్లోకి అడుగు పెట్టింది. వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెల పేరుతో విక్రయాలు జరుపుతున్నది.
నాగర్‌కర్నూల్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల జీవనాన్ని భారంగా మార్చుతున్నది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెంచింది. ముఖ్యంగా వంట నూనెల ధరలు లీటర్‌కు దాదాపుగా రూ.100 పెరిగాయి. కాగా, ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగైదు నెలలుగా స్తబ్దుగా ఉన్న చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఎన్నికలు పూర్తవడంతో అందరూ ఊహించినట్లుగానే వంట గ్యాస్‌తోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసల చొప్పున ప్రజలపై భారం వేసింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ద్విచక్రవాహనాలు, కార్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం కలవరపెడుతున్నది. అంతేకాకుండా ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై కూడా పడనున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ధరలను పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొన్నది.
వంటింటి గ్యాస్ ధరలను కూడా రూ.50 చొప్పున పెంచింది. ప్రస్తుతం రూ.962 ఉన్న సిలిండర్ ధర రూ.1,012కు చేరుకున్నది. సిలిండర్ ధరలు గతేడాది అక్టోబర్ తర్వాత మళ్లీ పెరిగాయి. వంట చెరుకుతో వాతావరణ కాలుష్యం ఉందన్న ఉద్దేశంతో వంట గ్యాస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతుండడంతో సామాన్యులు తిరిగి వంట చెరుకు, నీలి కిరోసిన్‌కు మొగ్గు చూపే పరిస్థితులు ఏర్పడనున్నాయి. గత అక్టోబర్‌లో రూ.15 చొప్పున పెరిగిన ధరలు.. ఇప్పుడు రూ.50 చొప్పున పెరిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో దీపం పథకం కింద 61,040 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. పీఎం ఉజ్వల యోజన పథకం కింద తెల్లరేషన్ కార్డు కలిగిన 34,366 మందికి గ్యాస్ కనెక్షన్ల చొప్పున మొత్తం 2,45,196 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇలా చూస్తే జిల్లాలో 2.50 లక్షల కుటుంబాలపై పెరిగిన వంట గ్యాస్ ధరలు భారాన్ని మోపనున్నాయి.
వంటింటిపై ధరల ‘యుద్ధం’..
వనపర్తి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యలో వంటింటిపై తీవ్ర ప్రభావం పడింది. ఇది సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ వస్తున్నది. ‘సందట్లో సడేమియా’ అన్నట్లుగా వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్క వస్తువు ధరలు పెంచుతూ వస్తున్నారు. చికెన్, మటన్, గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంటనూనె ఇలా ఏ వస్తువూ తక్కువ కాదన్నట్లుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, కల్తీ మాఫియా రం గంలోకి దిగింది. పామాయిల్, తవుడు నూనెలు కలిపి వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెల పే రుతో విక్రయిస్తున్నారు. చికెన్ ధర రూ.300కు చేరువలో ఉన్నది. మటన్ కిలో రూ.650 ఉండగా.. ప్రస్తుతం రూ.800 పలుకుతున్నది. దీంతో సామాన్యుడు మటన్, చికెన్ కొనుగోలు చేయాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. యుద్ధం కంటే ముందు పొద్దుతిరుగుడు నూనె కిలోకు రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.195కు చేరుకున్నది. పామాయిల్ రూ.130 నుంచి రూ.185కు, రైస్‌రిచ్ రూ.150 నుంచి రూ.180కు, పల్లీనూనె రూ.163 నుంచి రూ.200కు చేరుకున్నది. ధరలు మరింత పెరుగుతాయనే ప్రచారం జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ధరలు చూసి భయమేస్తున్నది..
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారుతున్నాయి. బైక్ తీయాలంటే పెట్రోల్ ధరలు చూసి భయమేస్తున్నది. డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకులపై భారం పడనున్నది. ధరలు తగ్గించి సామాన్యుడిని కాపాడాల్సిన బీజేపీ సర్కార్ ఆ దిశగా ఆలోచిండం లేదు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించి భారం తగ్గించాలి.
– చిట్యాల రాము, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు, వనపర్తి