మిడ్జిల్, మే 4 : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైకుంఠ ధామాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించింది. జిల్లాలో చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతకు ముందు శ్మశాన వాటికలు చెట్లు, ముళ్ల పొదలతో నిండి ఉండేవి. దహన సంస్కారాల తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్నానాలు చేసేందుకు కనీసం నీటి వసతి, స్నానాల గదులు ఉండేవి కావు. కొన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగిశాక స్నానాల కోసం కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువులు, కుంటలు, బోర్లు, బావుల వద్దకు వెళ్లేవారు. ఆత్మగౌరవవంతో అంతిమ వీడ్కోలు పలకాల్సిన చోట ఇబ్బందులు తలెత్తేవి. శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి కనీస వసతులు కల్పించాలని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు. తెలంగాణ ప్రభుత్వం శ్మశాన వాటికలను వైకుంఠ ధామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. అంతిమ వీడ్కోలుకు వచ్చే కుటుంబీకులు, బంధుమిత్రులకు ఓదార్పునిచ్చేలా మౌలిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వైకుంఠధామాలను నిర్మించాలనే సదాశయంతో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించింది. ఈ పథకం కింద మొదటగా ఒక్కో నిర్మాణానికి రూ10 లక్షలు కేటాయించారు. ఈ మొత్తం సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి వ్యయాన్ని రూ.12.60 లక్షలకు పెంచింది. కలలో కూడా ఊహించని విధంగా సకల వసతులతో సర్వాంగ సుందరంగా వైకుంఠధామాలుగా తీర్చిదిద్దడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
మౌలిక వసతులతో..
హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా వైకుంఠధామాలుగా రూపుదిద్దుకుంటున్న శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శవ దహనం చేసేందుకు ప్రత్యేకంగా రెండు బర్నింగ్ ప్లాట్‌ఫాంలు, పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా స్నానాల గదులు, వేచి ఉండేందుకు హాల్, ప్రత్యేక గది నిర్మాణంతోపాటు 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ నీటి ట్యాంక్, నల్లాలు, రెండు సోలార్ లైటింగ్ సిస్టంలను అమర్చుతున్నారు.
ఆహ్లాదకరంగా..
మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వైకుంఠధామాల ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు, స్వచ్ఛమైన గాలిని ఇచ్చే వేప, కానుగ తదితర రకాల మొక్కలను స్థల విస్తీర్ణాన్ని బట్టి నాటారు. వైకుంఠధామం ద్వా రాలను వివిధ ఆకృతులతో ప్రాంగణాలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.