ఎదులాపురం, ఫిబ్రవరి 9 : ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్‌తో కలిసి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డుల కౌంటింగ్ కోసం 49 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకో వార్డులో సుమారు 3వేలకు పైగా ఓట్లు ఉండే అవకాశం ఉన్నందున, మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెకింపు పూర్తి చేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది ఫిబ్రవరి 12న జరిగే రెండో విడుత శిక్షణ, అలాగే 13న జరిగే కౌంటింగ్ రోజున నిర్ణీత సమయానికి హాజరు కావాలని, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్, మాస్టర్ ట్రెయినర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
144 సెక్షన్ అమలు
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు, 200 మీటర్ల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, ప్రజలు గుమిగూడి ఉండరాదని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ నెల 10వ తేదీన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి బందోబస్తుపై సూచనలు చేశారు. టపాకాయలు పేల్చడానికి అనుమతులు లేవన్నారు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, మావల సీఐ కర్రె స్వామి, నూతన మున్సిపల్ కమిషనర్ రాజు పాల్గొన్నారు.