నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 28: నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వీరంగం సృష్టించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య ఘటన మరువకముందే పెద్దకొత్తపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకుడు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జుల పరమేష్ నాయుడిపై హత్యాయత్నం జరగడం నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనాలు రేకత్తిస్తున్నది. ప్రభుత్వం పథకాలపై ప్రశ్నించినందుకు పరమేష్‌పై కాంగ్రెస్ నాయకులు రెండోసారి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. 2023, నవంబర్ 29న తెల్లవారితే పోలింగ్ ఉన్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు.. ఆరోజు అర్ధరాత్రి గుజ్జుల పరమేష్ నాయుడు ఇంటిపై కొంతమంది దుండగులు దాడి చేసి అత్యాయత్నానికి ప్రయత్నించారు. తాజాగా గురువారం రాత్రి కాంగ్రెస్ నాయకులు శివరావు 50 మందితో కలిసి సాతాపూర్ బస్టాండ్ ఆవరణలో హతమార్చేందుకు పథకం ప్రకారం దాడిచేశారు. దాడి జరుగుతున్నప్పుడు గ్రామస్తులు కలుగజేసుకోవడంతో రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ నాయకుల చేతిలో తీవ్రంగా గాయపడిన పరమేష్‌ను గ్రామ బీఆర్ఎస్ నాయకులు హుటాహుటిన నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
దీంతో గ్రామంలో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ముందు రైతు బంధు రైతు భరోసా అందరికీ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కొంతమందికి మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులను దులుపుకుందని, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, ఇందిరమ్మ ఇండ్లు ఏమయ్యాయని గురువారం సాయంత్రం గుజ్జుల పరమేష్ ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ ఆదరణ పెరుగుతుందని గ్రహించి పథకం ప్రకారం కొంతమందికి మద్యం తపించి దాడి చేయించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వానికి చేతనైతే సంక్షేమ పథకాలను అమలు చేయాలి కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడితే ఎలా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో తోపాటు మండలంలో రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నాయకుని తప్పించేందుకే హత్యాయత్నం చేశారని బీసీ సంఘాల నాయకులు ఆరోపించారు.
గతంలో కూడా దాడులు…
గత సంవత్సరం సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేందుకు గతంలో జరిగిన దాడులలో సైతం గుజ్జుల పరమేష్ నాయుడు ప్రాణాలతో బయటపడ్డారు. నవంబర్ 30న పోలింగ్‌కు ముందు రోజు రాత్రి ఏజెంట్ల ఏర్పాట్లు పోలింగ్ మేనేజ్మెంట్పై కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఇంటిపైకొచ్చి దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నం చేశారని, కాంగ్రెస్ నాయకుల తో తన ప్రాణాన్ని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు దానిపై ఎలాంటి పురోగతి లేకపోవడంతోనే మళ్లీ దాడులు చేసేందుకు స్వేచ్ఛ దొరికినట్లు అయిందని కొంతమంది చర్చించుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కన్నుసన్నల్లో మెలుగుతుండడంతోనే బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులు జరగడం పరిపాటిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకుడుపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని ఆ పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. హత్యా రాజకీయాలను మానుకోవాలన్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మా ప్రభుత్వం వచ్చిన రోజు చట్టపరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకుడు గుజ్జుల పరమేష్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.