నాగర్ కర్నూల్ : ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా అందులో చిక్కుకున్న లోకో ఇంజిన్ను శనివారం బయటకు తీశారు. ఈ సందర్భంగా టన్నెల్ లోపల సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాలు, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి కిరణ్ కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, జీఎస్ఐ అధికారి పంకజ్ తిరుగున్, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, అన్వి రోబోటిక్స్ ప్రతినిధులు విజయ్, అక్షయ్, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ.. ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సహాయక బృందాలు రెట్టింపు వేగంతో సహాయక చర్యలు చేపట్టడంపై, ప్రమాద ప్రదేశం నుండి లోకో ఇంజన్ను వెలికితీయడంపై అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో సహాయక చర్యలను కొనసాగించాలని సూచించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మట్టి కింద కూరుకుపోయి వున్న లోకో ట్రైన్ క్యాబిన్లను, లోకో ఇంజన్ను వెలికి తీసి, టన్నెల్ బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
లోకో ట్రైన్ ఉన్న ప్రదేశంలో మట్టిని తొలగించే పని పూర్తి చేసి, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ కొనసాగుతోందని, లోపలి ప్రదేశాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారని శివశంకర్ లోతేటి వివరించారు. సహాయక చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సహాయక బృందాలు సమన్వయంతో, పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాలకు కావలసిన సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు శివ శంకర్ లోతేటి తెలిపారు. ప్రతి రోజూ నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ, మట్టి తవ్వకాలు, స్టీలును తొలగించే ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నాయని చెప్పారు. 4 ఎస్కేవేటర్లు, 2 బాబ్ క్యాట్లు నిరంతరాయంగా మట్టిని తొలగిస్తూ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. మట్టి తవ్వకాలకు అనుగుణంగా కన్వేయర్ బెల్టును, వెంటిలేషన్ పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు ప్రత్యేక అధికారి చెప్పారు.