నాగర్‌కర్నూల్ : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నాగర్ కర్నూల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ తీర్మానించింది. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన నాగర్ కర్నూల్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రవేశపెట్టగా పార్టీ కార్యకర్తలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే అన్ని గ్రామాల్లో, మండలాల్లో పెద్దఎత్తున తీర్మానాలు చేసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అందజేస్తామని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ తీర్మానాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు అందజేస్తామని ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ వజ్రోత్సవాలు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.