కల్వకుర్తి రూరల్ ఏప్రిల్ 29 : ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని మిల్లర్లు తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక క్వింటాలు వరి ధాన్యానికి దాదాపుగా 8 నుంచి 10 కిలోల తరుగు తీయడంతో అన్న దాతలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రైతులను మోసం చేయడం పట్ల రైతులు రోడ్డెక్కి నిరసన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిల్లర్ల దోపిడీ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు మిల్లర్ల దోపిడీని ఖండిస్తూ ఆర్డిఓ కార్యాలయం నుండి పాలమూరు చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు.
ధాన్యాన్ని రోడ్డుపై పారబోశారు. మిల్లర్లు రైతులను దారుణంగా మోసం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకో వడంలేదని ఆరోపించారు.ఒక క్వింటాలుకి ఎనిమిది నుంచి 10 కిలోల వరకు తరుగు తీయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేశారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటూ రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూగొప్పలు చెప్పుకోవడమే కానీ క్షేత్రస్థాయిలో లేదని విమర్శించారు. అనంతరం మిల్లర్లు తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయంలో అధికారికి వినతి పత్రాన్ని అందించారు.