కొల్లాపూర్, ఆగస్టు 2: అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా నాగర్‌కర్నూలు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమశిల తెలంగాణ టూరిజం గెస్ట్ హౌస్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వమించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, గురుకులాలు, విద్య, వైద్యం, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించారు. అలాగే కృష్ణానదిపై సాగునీటి ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఉద్ధండాపూర్ వరకు పొడిగించడంతో పాటు నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పొరపాట్లకు తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరిగే ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఆయా పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు.
పథకాలు లోపాలు లేకుండా పటిష్టంగా అమలుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యాపరంగా గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు పూర్తిస్థాయిలో పరిరక్షించి మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.