తిమ్మాజీపేట, జూన్ 28 : కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించడంతో పాటు, దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ తిమ్మాజిపేట మండల నాయకులు పిలుపునిచ్చారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో శనివారం పార్టీ యువజన విభాగం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, బీఆర్ఎస్లో చురుకుగా పనిచేస్తున్న వారిని చేర్చుకునేందుకు అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వినకపోతే పోలీస్ కేసుల పేరుతో లొంగతీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరూ భయపడద్దని అండగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కొట్లాడుతామన్నారు.
కాంగ్రెస్ అరాచకాపాలనను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 బూటకపు హామీలతో కాంగ్రెస్ ప్రజలకు పంగనామాలు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలన్నారు. గ్రామాల్లో గత పది సంవత్సరాల కేసీఆర్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోబీఆర్ఎస్ పార్టీదే గెలుపని వారు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో యువత కష్టపడి పని చేయాలని, అభ్యర్థుల విజయం కోసం శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పకీర స్వామి, జయపాల్ రెడ్డి, నర్వ రఘు, పాండు యాదవ్, వెంకటేశ్, మల్లేశ్, సలావుద్దీన్ పాల్గొన్నారు.