Anganwadi Centres | కొల్లాపూర్, సెప్టెంబర్ 15 : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌తోపాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం నూతన విద్యా విధానాన్ని తెచ్చిందన్నారు. ప్రమాదకరమైనటువంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని వారన్నారు. పీఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయం చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలన్నారు. విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు అప్పజెప్పాలని వారన్నారు.
ఐసీడీఎస్ మంత్రి హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలను వెంటనే చెల్లించాలి. జీవో నెంబర్ 8ను సవరించాలన్నారు. పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను 2024 జులై 1 నుండి చెల్లించాలి. మూడు నెలల పీఆర్సీ మినీ అంగన్వాడీ టీచర్లకు, 11 నెలల రిటైర్మెంట్ బెనిఫిట్స్, 10 లక్షల ఇన్సూరెన్స్ క్లైయిమ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. 10 లక్షల సిబిఈ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. సీనియార్టీని బట్టి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఐసీడీఎస్ మంత్రి హామీ ప్రకారం కారుణ్య నియమాకాలు త్వరలో నియమించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడి ఉద్యోగులకు గ్రాడ్యుయేట్స్ చెల్లించాలి. టీచర్లతో సమానంగా హెల్పర్లకు 20వేల వేతనం ఇవ్వాలి. 2017 నుండి టీఏ, డీఏ, ఇంక్రిమెంట్, ఇంచార్జ్ అలయన్స్ బకాయిలు చెల్లించాలి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. డ్యూటీలు రద్దు చేయాలి. పనిభారాలను తగ్గించాలి..
ఈ సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ఇండ్ల ముందు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25న ఛలో సెక్రటేరియట్ నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ కృష్ణయ్యకు అందించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బీ శివవర్మ సహాయ కార్యదర్శి, పొదిల రామయ్య, రాము, యూనియన్ జిల్లా నాయకురాలు నీరజ హుస్సేన్ అమ్మ చిన్నమ్మ లక్ష్మి జ్యోతి గోవిందమ్మ సుశీల భాగ్యమ్మ జయమ్మ సులోచన శ్రీదేవి లక్ష్మి దేవమ్మ ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఎండి సలీం కెవిపిఎస్ మండల కార్యదర్శి బత్తిని రాజు రజక సంఘం నాయకులు జల్లాపురం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.