నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్వీ నాయకులు వంశీ గౌడ్, కిశోర్ గౌడ్, కుమ్మెర తిరుపతయ్యను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరందర్నీ నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ముందస్తు అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజా సమస్యలను చెప్పుకోకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాడు తొలిరోజు పర్యటన మమ అనిపించింది. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్‌కు కర్ణాటక మాజీ మంత్రి బోసు రాజుతో కలసి నేరుగా ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలో కొనసాగుతున్న నారాయణపేట- కొడంగల్ ఎతిపోతల పనులను పరిశీలించారు. ఈ ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. గంట సమయంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు, మ్యాపుల పరిశీలన, ఫొటో ఎగ్జిబిషన్ల సందర్శన, కార్యకర్తలతో ఫొటోలు, అధికారులతో వాకబు చేశారు. మక్తల్ పర్యటన పోలీసు నిర్బంధంలోనే సాగిందని, ప్రజలకు అందుబాటులో లేకుండా ముఖ్యమంత్రి కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేశారు.